Thursday, September 21

కత్తికి పదును పెంచి పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్న ఛానళ్ళు

మీడియా సెన్సేషన్ కోసం చినుకులా మొదలైన ఒక సంఘటనను వర్షంలా, తుఫానులా చివరికి సునామీలా మార్చేయగలదు. ఇప్పుడు అలానే తయారయ్యింది కత్తి మహేష్పవన్ అభిమానుల మధ్య రచ్చ. కత్తి మహేష్ ఏమి చదువులేని వాడు కాదు. అపారమైన తెలివి అనుభవం అంతకు మించిన విజ్ఞత కలిగిన వాడు. అలాంటి వ్యక్తికి ఇలాంటి బెదిరింపులు వస్తే ఎలా వాటిని పరిష్కరించుకోవాలి, ఎలా వాటికి అడ్డుకట్ట వేయాలి అనే విషయమై పోలీసులకు మరియు తన పై సోషల్ మీడియా లో జరుగుతున్నా ప్రచారానికి గాను సైబర్ పోలీసులను ఇప్పటికే ఆశ్రయించి ఉండొచ్చు.

కానీ, కత్తి మహేష్ ఇక్కడే కొద్దిగా చాకచక్యంగా వ్యవహరించాడు. తనపై జరుగుతున్న మానసిక దాడులను, అనుభవిస్తున్న క్షోభను ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన వ్యక్తులు అగ్ర హీరోల పై ఏవైనా వ్యాఖ్యలు చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. నిజాన్ని ఒప్పుకోవడం, మనస్సులో ఉన్నది మాట్లాడటం అనేది సినిమా వాళ్ళ విషయాల్లో చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్తు ఉండదు అనే భయంతో. మరి అలాంటివి తనకు లేవంటున్న కత్తి మహేష్ తనకు వస్తున్న బెదిరింపులను బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి మీడియా ఛానెళ్లను ఆశ్రయించినట్లున్నాడు.

టి.ఆర్.పి ల కోసం క్యూలు కట్టే మన ఛానళ్ళు ఒక దాని తర్వాత ఒకటి మహేష్ కత్తి ఇంటర్వ్యూ ల కోసం ఎగబడ్డాయి. హాట్ సీట్ లో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ అభిమానులతో లైవ్ చర్చలు మొదలుపెట్టాయి. ఎవ్వరికి అంతగా తెలియని కత్తి బిగ్ బాస్ తో కొద్దిగా పాపులారిటీ సంపాదిస్తే, అది పవన్ అభిమానుల పుణ్యమా అని పీక్ స్టేజి కు చేరింది.

టి.వి ల ప్రత్యక్ష ప్రసారాల్లో కత్తి మహేష్ తన అనుభవాన్నంతా రంగరించి చిరంజీవి రాజకీయ ప్రవేశం దగ్గర నుండి పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు వరకు తనదైన శైలి లో మెగా అభిమానులను రెచ్చగొట్టేలా విశ్లేషణలు చేసాడు. వివాదాలకు సర్ది చెప్పాల్సిన మీడియా అగ్నికి ఆజ్యం పోస్తూ చోద్యం చూస్తోంది. వింత వింత ప్రశ్నలతో సమస్య తీవ్రత మరింత పెంచేలా కృషి చేస్తోంది.

దీంతో కత్తి మహేష్ పై పవన్ కళ్యాణ్, ఆయన అభిమానుల పై రెచ్చిపోయి విమర్శలు చేస్తున్నారు. టి.వి ఛానళ్ళు తమ రేటింగ్ కోసం కత్తిని కూర్చోబెట్టి మరీ పవన్ అభిమానులని, పవన్ కళ్యాణ్ని తిట్టిస్తున్నాయి. అలా టీ వి ఛానెళ్ల వాళ్ళు కత్తికి పదును పెంచి సెలబ్రిటీ స్టేటస్ రావడానికి ప్రత్యక్షంగా, పవన్ కళ్యాణ్ పరువు తీయడానికి పరోక్షంగా దోహదపడుతున్నాయి. ఈ విషయం ఇప్పటికేనా సర్ధుమణిగేలా చూస్తే ఇరువురికి మంచిదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

%d bloggers like this: